: సీబీఐపై బీజేపీ తీవ్ర విమర్శలు


కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియాను అరెస్టు చేయడం ద్వారా సీబీఐ.. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నట్టుందని కాషాయదళం ఆరోపిస్తోంది. కటారియా గుజరాత్ లో మోడీ తర్వాత అత్యున్నత స్థాయి నాయకుడు కావడం గమనార్హం. పైగా మోడీకి అత్యంత సన్నిహితుడన్న ముద్ర ఉంది. కటారియాను అదుపులోకి తీసుకున్న సీబీఐ మోడీని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోందని బీజేపీ రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు.

ఇటీవలే రైల్వే ముడుపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి బన్సల్ పేరును ఇంతవరకు ఛార్జిషీటులో చేర్చని సీబీఐ.. మోడీ వ్యవహారంలో దూకుడు ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆకర్షణ కలిగిన నాయకులను అప్రదిష్ట పాలుజేయాలని సీబీఐ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.

కాగా, సొహ్రాబుద్దీన్ తోపాటు అతని భార్యను యాంటీ టెర్రిరిజం స్క్వాడ్ 2005లో గాంధీనగర్ వద్ద బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేసింది. ఉగ్రవాదులన్న నెపంతో వారిద్దరిని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చి గుజరాత్ లో బలిగొన్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు రాష్ట్ర ఐపీఎస్ అధికారులను కూడా సీబీఐ తన ఛార్జిషీటులో నిందితులుగా పేర్కొంది.

  • Loading...

More Telugu News