Andhra Pradesh: ఏపీలో మొదట అసెంబ్లీ ఫలితాలు, ఆపై కాస్త ఆలస్యంగా లోక్ సభ ఫలితాలు వెల్లడిస్తాం: ద్వివేది
- వీవీ ప్యాట్ స్లిప్పుల కారణంగా జాప్యం జరిగే అవకాశం
- ఫలితాలు సకాలంలో వెల్లడించడం వీలుకాదు
- ఈవీఎం ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పులు సరిపోల్చుకుంటాం
ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. ఏపీలో మొదట అసెంబ్లీ ఫలితాలు వెల్లడిస్తామని, ఆపై లోక్ సభ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తొలుత ఈవీఎం ఓట్లు లెక్కించిన తర్వాత వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్సి రావడమే ఆలస్యానికి కారణంగా ద్వివేది పేర్కొన్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు వినియోగించినట్టు వెల్లడించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వీవీ ప్యాట్ స్లిప్పుల రాండమైజేషన్ ఉంటుందని చెప్పారు. అంటే, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 అసెంబ్లీ, 5 లోక్ సభ వీవీ ప్యాట్ల నుంచి స్లిప్పులను లెక్కిస్తామని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తమ్మీద 1,750 వీవీ ప్యాట్ల నుంచి స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని సీఈవో వివరించారు. ఒక్కో వీవీ ప్యాట్ లో సుమారు 1000 ఓట్లకు సంబంధించిన సమాచారం ఉంటుందని, ఒక్కో వీవీ ప్యాట్ లెక్కించడానికి సగటున గంటన్నర వరకు సమయం పడుతుందని ద్వివేది చెప్పుకొచ్చారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ప్రయాసతో కూడుకున్న పని కావడంతో దేశవ్యాప్తంగా ఫలితాల వెల్లడిపై ప్రభావం చూపిస్తుందని, సకాలంలో వెల్లడించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాలు వెల్లడవ్వాలంటే సగటున ఐదారు గంటల సమయం పట్టొచ్చని ద్వివేది అంచనా వేశారు. ఈవీఎంలలో పోలైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు సరిపోల్చుకున్న తర్వాతే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.