Telangana: వారం రోజుల తర్వాత తల్లి సింధుశర్మను చూసి భోరున ఏడ్చిన రిషిత... బలవంతంగా లాక్కెళ్లిన తండ్రి!
- రిషితను సింధుకు అప్పగించని నూతి రామ్మోహనరావు కుటుంబం
- కన్నీటిపర్యంతమైన సింధు శర్మ
- మాట తప్పారంటూ ఆందోళన
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇంటి వ్యవహారం ఇవాళ 'భరోసా' పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ కు చేరింది. రామ్మోహనరావు కోడలు సింధు శర్మ తన అత్తమామలు, భర్తపై గృహహింసకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తన పిల్లలిద్దరినీ అప్పగించాలని సింధు శర్మ డిమాండ్ చేస్తుండడంతో 18 నెలల పసికందు శ్రీవిద్యను ఆదివారం సాయంత్రం అప్పగించిన నూతి రామ్మోహనరావు కుటుంబం ఆమె పెద్ద కుమార్తె రిషిత విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది.
ఇవాళ పోలీసు కౌన్సిలింగ్ కేంద్రం భరోసా వద్దకు వచ్చినా కానీ రిషితను అప్పగించలేదు. దాదాపు వారం రోజుల తర్వాత తల్లిని చూసిన చిన్నారి రిషిత భోరున ఏడ్వడం అక్కడున్నవాళ్లందరినీ కలచివేసింది. తన బిడ్డను చూసుకుని సింధు కూడా తల్లడిల్లిపోయింది. అయితే, రిషితను ఆమె తండ్రి వశిష్ట తనతోపాటు తీసుకుని వెళ్లిపోవడంతో సింధు తీవ్ర నిరాశకు గురైంది.
తల్లి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన రిషితను వశిష్ట బలవంతంగా లాక్కెళ్లడంతో అక్కడున్న వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, తన పెద్ద కుమార్తెను అప్పగిస్తామని చెప్పి వశిష్ట కుటుంబం మాటతప్పిందని సింధు శర్మ భరోసా కేంద్రం వద్దే ఆందోళనకు దిగడంతో అక్కడి సిబ్బంది ఆమెను ఊరడించే ప్రయత్నం చేశారు.