BJP: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ దీక్ష భగ్నం... అరెస్ట్ చేసి నిమ్స్ కు తరలించిన పోలీసులు
- పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సొమ్మసిల్లిన బీజేపీ మహిళా కార్యకర్త
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ విద్యార్థుల మార్కుల్లో అవకతవకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఆయన ఎలాగోలా దీక్షా వేదికను చేరుకున్నా, కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అరెస్ట్ చేశారు. క్రైమ్ విభాగం డీసీపీ అవినాశ్ మహంతి ఆధ్వర్యంలోని పోలీసు బృందం లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి నేరుగా నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు.
లక్ష్మణ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళుతున్నారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులకు, కాషాయదళానికి మధ్య తోపులాట జరగడంతో ఓ మహిళ స్పృహకోల్పోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.