Tollywood: సీటు బెల్టే నన్ను బతికించింది: 'నువ్వు తోపురా' హీరో సుధాకర్

  • ఆమె చనిపోవడం ఎంతో బాధ కలిగించింది
  • మా డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి
  • అతని పరిస్థితి విషమంగా ఉంది

'నువ్వు తోపురా' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన యువ హీరో సుధాకర్ ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో మొక్కలకు నీళ్లు పెడుతున్న కార్మికురాలిని సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ కార్మికురాలు దుర్మరణం పాలవగా, సుధాకర్ కు గాయాలయ్యాయి. దీనిపై, సుధాకర్ మాట్లాడుతూ, తాను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే బతికి బయటపడ్డానని తెలిపారు.

 అయితే, అందరూ అనుకుంటున్నట్టు ప్రమాద సమయంలో వాహనం నడుపుతోంది తాను కాదని, డ్రైవర్ నడుపుతుంటే తాను పక్క సీట్లో కూర్చుని ఉన్నానని స్పష్టం చేశారు. తమ కారు డ్రైవర్ కూడా ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగిస్తోందని హీరో సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.

తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అదేనని అన్నారు. అందరికీ మెసేజ్ లు పంపిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైందని, సీటు బెల్టు లేకుంటే తలకు దెబ్బ తగిలేదని తెలిపారు. ప్రమాదం తర్వాత పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎంతో సాయం చేశారని సుధాకర్ వెల్లడించారు. ప్రమాదంలో తన ఫోన్ పోయిందని, దాంతో ఎవరికీ సమాచారం అందించలేకపోయానని వివరించారు.

అయితే, ఆ సమయంలో తానే కారు నడుపుతున్నట్టు కొన్ని వెబ్ సైట్లు రాశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News