Telangana: కోతకొచ్చిన పంట పొలంలో ఆవులు మేస్తుండడం చూసి తట్టుకోలేకపోయిన ఎస్సై
- వాహనం ఆపి ఆవులను పారదోలిన వైనం
- సంబరపడిపోయిన పొలం యజమాని
- సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల వెతలు అన్నీఇన్నీ కావు. పొలంలో విత్తనాలు చల్లడం నుంచి పంట చేతికొచ్చి గిట్టుబాటు ధర కళ్ల జూసేవరకు ఎన్ని సమస్యలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అన్ని వర్గాల వారు రైతులకు సంఘీభావం ప్రకటించడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా, విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ ఎస్సై తన వాహనంలో వెళుతూ దార్లో ఓ చోట పొలంలో ఆవులు పడి మేస్తుండడం చూసి తట్టుకోలేకపోయారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఈ ఘటన జరిగింది. కాళేశ్వరం ఎస్సై శ్రీనివాసులు గోదావరి బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ నిమిత్తం వెళ్లి వస్తుండగా, పంటకొచ్చిన ఓ పొలంలో ఆవుల మంద పడి మేస్తుండడం గమనించారు. వెంటనే తన జీప్ ఆపి హ్యాండ్ స్టిక్ తీసుకుని పొలంలో దిగారు. పంటకు నష్టం చేకూరుస్తున్న ఆ ఆవులను పొలం నుంచి పూర్తిగా అవతలికి పారదోలారు.
ఈ విషయంలో ఆయనకు ఇతర కానిస్టేబుళ్లు కూడా సహకరించారు. ఆవులన్నీ పొలం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విషయం తెలిసిన పొలం సొంతదారు తొడెం మల్లారెడ్డి విపరీతంగా సంబరపడిపోయారు. ఓ రైతు తన పొలాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాడో బాగా తెలిసిన ఆ ఎస్సై తన స్థాయిని కూడా పట్టించుకోకుండా ఆవులను తోలిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.