Andhra Pradesh: సీఎస్ పై చంద్రబాబు వ్యాఖ్యలే మా ప్రధాన అజెండా... కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా వేశాం: ప్రవీణ్ కుమార్
- ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం వాయిదా
- 184 మంది సభ్యులకు గాను 14 మంది హాజరు
- ఎన్నికల విధుల్లో ఉన్న మిగతా అధికారులు
విజయవాడ పున్నమిఘాట్ లోని హరిత హోటల్లో నిర్వహించ తలపెట్టిన ఐఏఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. సంఘంలో 184 మంది సభ్యులు ఉండగా, తాజా సమావేశానికి 14 మందే హాజరయ్యారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశామని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే తమ సమావేశంలో ప్రధాన అజెండాగా భావించామని, కానీ చాలామంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో సమావేశం నిర్వహించలేకపోతున్నామని వివరించారు. కనీస స్థాయిలో సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి తీర్మానాలు చేయలేదని, కనీసం అజెండాపై చర్చించే వీల్లేకుండా పోయిందని అన్నారు. కోరం ఉండాలంటే 46 మంది హాజరు కావాల్సి ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.