BJP: ఈ బీజేపీ అభ్యర్థిపై ఉన్న కేసులు ప్రచురించడానికి దినపత్రికలకు నాలుగు పేజీలు పట్టాయి!

  • పత్తనంతిట్ట బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ పై 240 కేసులు
  • వాటిలో 90 శాతం కేసులు శబరిమల వివాదానికి సంబంధించినవి
  • పేపర్లో ఆ వివరాలు చూసి టెండర్ నోటిఫికేషన్ అనుకున్న ప్రజలు

లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేరళలోని పత్తనంతిట్ట లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ పై 240 కేసులు ఉన్నట్టు అఫిడవిట్ లో తేలింది. అయితే, ఆ కేసుల వివరాలన్నీ ప్రచురించడానికి దినపత్రికలో నాలుగు పేజీలు అవసరమయ్యాయి. ఉదయాన్నే ఆసక్తిగా పేపర్ చూసినవాళ్లకు నాలుగు పేజీలు ప్రత్యేకంగా కనిపించడం చూసి అదేదో టెండర్ నోటిఫికేషన్ అని భావించారు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, రెండొందలకు పైగా కేసులున్న సురేంద్రన్ నిజానికి క్రిమినల్ కాదు. ఆయన ఇటీవల శబరిమల ఆలయ వివాదంలో తరచుగా స్పందించడమే కాకుండా, అనేక నిరసనలు, ధర్నాల్లో పాల్గొన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు అనుకూల నిర్ణయం వెలువరించడంతో కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలకు సురేంద్రన్ నాయకత్వం వహించడంతో ఆయనపై వందల కేసులు నమోదయ్యాయి. అదీ అసలు విషయం!

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులను సొంత ఖర్చులతో మూడు పర్యాయాలు పేపర్లో ప్రచురించాలి. సురేంద్రన్ కు ఈ విషయంలో తడిసి మోపెడవుతోంది. ఒక్కో పర్యాయం రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఆ విధంగా ఈ బీజేపీ ఎమ్మెల్యేకి మొత్తం రూ.60 లక్షల వరకు వ్యయం తప్పదు. అయితే, లోక్ సభ అభ్యర్థి ఎన్నికల ఖర్చుపై రూ.75 లక్షల వరకే పరిమితి ఉంది. ఆ లెక్కన సురేంద్రన్ వద్ద రూ.60 లక్షల పేపర్ ఖర్చులు పోను ఇంకా రూ.15 లక్షలే మిగిలుంటాయి. వాటితోనే ఎన్నికలయ్యే వరకు సర్దుకోక తప్పదు.

BJP
  • Loading...

More Telugu News