Telugudesam: శాంతిభద్రతల సమస్య వస్తే సమీక్ష ఎవరు జరపాలి? ఎన్నికయ్యే ప్రభుత్వం వచ్చే వరకు దర్యాప్తు చేయకుండా కూర్చోవాలా?: కనకమేడల
- అధికారులకు హితవు పలికిన టీడీపీ నేత
- కోడ్ పేరుతో సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి
- అలా చేస్తే ప్రజలు క్షమించరు అంటూ ఫైర్
ఎన్నికల సంఘం తీరు పట్ల టీడీపీ సర్కారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి పనులకు సంబంధించిన సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించడాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాజా పరిణామాలపై స్పందించారు. సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించలేదని అన్నారు.
ఆయన ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయనాయకులకు సూచనలు ఇచ్చేవారే తప్ప, రాజకీయనాయకుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికారులకు సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. "ఈ విషయంలో అధికారులు కూడా సంయమనం చూపాలి. ముఖ్యమంత్రి ఎలాంటివాడన్న విషయం ఆలోచించాలి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే క్రమంలో పాలకుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప, ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవాలనుకోవడం సరికాదు. అలా చేస్తే ప్రజలు మనల్ని క్షమించరు" అంటూ హితవు పలికారు.
సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెడితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే కోడ్ పేరుతో పట్టించుకోకుండా ఉంటారా? మళ్లీ ఎన్నికయ్యే ప్రభుత్వం వచ్చేవరకు పోలీసులు దర్యాప్తు చేయకుండా వదిలేస్తారా? అంటూ కనకమేడల నిలదీశారు.
"రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవరు సమీక్షించాలి? కోడ్ ఉంది కాబట్టి సమీక్ష జరపకూడదని అంటున్నారు. అధికారులు ఇబ్బందిపడకూడదనే ముఖ్యమంత్రి గారు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం మోదీ కంటే ఎంతో యాక్టివ్ గా ఉండి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులపైనా వెంటపడి మరీ దాడులు చేస్తున్నారు. తద్వారా మోదీ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు" అంటూ నిప్పులు చెరిగారు.