Chandrababu: రేపు మీకు ఇదే పరిస్థితి ఎదురు కాకపోతే చూసుకోండి!: మాండ్య నుంచి మోదీని ఛాలెంజ్ చేసిన చంద్రబాబు
- నోట్ల రద్దు పిచ్చి పని
- నోట్ల రద్దు కారణంగా రూ.3 లక్షల కోట్ల అవినీతి
- రూ.2000 నోటు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో మోదీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో దారుణమైన పరిపాలన సాగుతోందని పరోక్షంగా కేంద్రం తీరును విమర్శించారు. నోట్ల రద్దు ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప ఎవరికీ ప్రయోజనం కలగలేదని అన్నారు. నోట్ల రద్దు కారణంగా 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి ఎందుకు రూ.2000 నోటు తెచ్చారో చెప్పాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ రెండు వేల నోటు వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, పూర్తిగా దెబ్బతినిపోయిందని మండిపడ్డారు.
బీజేపీ పెద్దలు చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకుండాపోయిందన్నారు. మోదీని ధిక్కరించిన నేతలపై రాష్ట్రాలకు వెళ్లి మరీ దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తమపై దాడులు చేయిస్తున్న మోదీ రేపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటారని, ఇదే తన చాలెంజ్ అని వ్యాఖ్యానించారు.