Chandrababu: 'జాగ్వార్' నిఖిల్ కోసం ఇక్కడికి వచ్చాను... కర్ణాటక గడ్డపై తెలుగులోనే మాట్లాడిన చంద్రబాబు
- మాండ్యలో ఎన్నికల ప్రచారం
- దేవెగౌడ, కుమారస్వామిలపై ప్రశంసల జల్లు
- కన్నడ, తెలుగు ప్రజల మధ్య సోదర బంధం ఉందన్న బాబు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ఇవాళ మాండ్యలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అత్యధిక భాగం తెలుగులోనే ప్రసంగించారు.
తెలుగు, కన్నడ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని, రెండు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో కలిసిపోయారని తెలిపారు. ఎంతోమంది తెలుగు ప్రజలను కన్నడసీమ ఆదరించిందని అన్నారు. ఎన్టీఆర్ కు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ అంటే ఎంతో అభిమానం అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ తెలుగువాళ్లకు బెంగళూరు, మైసూరు నగరాలతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు.
1996లో యునైటెడ్ ఫ్రంట్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాని పదవికి దేవెగౌడ ఒక్కరే సరైన అభ్యర్థిలా కనిపించారని చంద్రబాబు కితాబిచ్చారు. ఆనాడు ఆయన కర్ణాటక సీఎం పదవిని త్యాగం చేసి దేశం కోసం ముందుకు వచ్చారని ప్రశంసించారు. ఇక, ఆయన తనయుడు కుమారస్వామి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జీడీపీ బాగా నమోదైందని, అందుకే ఆయన మరోసారి సీఎం అయ్యారని కొనియాడారు.
ఇక, మాండ్య నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. కన్నడ చిత్రసీమలో నిఖిల్ కు 'జాగ్వార్' అనే పేరుంది. చంద్రబాబు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మీ జాగ్వార్ నిఖిల్ కోసం మాండ్య వచ్చానని చెప్పగానే సభకు హాజరైన వారంతా చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు.