Chandrababu: బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరిస్తే పట్టించాం: చంద్రబాబు
- 8 లక్షల ఓట్ల తొలగింపు కుట్రను భగ్నం చేశాం
- అందుకే పోలీసుల్లా వ్యవహరిస్తున్నాం
- ట్విట్టర్ లో చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలింగ్ అవకతవకలు, ఈవీఎంల లోపాలపై తనది మడమతిప్పని పోరాటం అని మరోసారి ఉద్ఘాటించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంలో జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్న చంద్రబాబు మరోసారి ఈ అంశంలో కీలకవ్యాఖ్యలు చేశారు. తాము ఈవీఎంల విషయంలో పోరాటం చేస్తోంది తమ గెలుపుపై అనుమానంతో కాదని, దొంగలను పట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికేనని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు తమతో కలిసివచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని కితాబిచ్చారు.
ఇప్పటికే తాము, జగన్ బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరిస్తే పట్టించామని, 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తే పట్టించామని వెల్లడించారు. ఇలాంటి దొంగలను పట్టించడం కోసమే తాము పోలీసుల్లా మారాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అన్ని వర్గాల మద్దతు లభించిందని, గెలుపు 1000 శాతం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దన్నుగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్లు చేశారు.