Chandrababu: చంద్రబాబు కలిసిన కొన్ని గంటల్లోనే టీడీపీకి లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం
- చంద్రబాబు అభ్యంతరాలపై వివరణ
- టీడీపీ నుంచి హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం
- ఆయన కాకుండా ఇతరులతో చర్చకు సిద్ధం అంటూ ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేఖ రాసింది. సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు, అంతకుముందు చోటుచేసుకున్న పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే తమ సమాధానాలను లేఖ రూపంలో టీడీపీకి పంపించింది. చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలను ఎన్నికల సంఘం తన లేఖలో ప్రస్తావించడమే కాకుండా వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
టీడీపీ నుంచి హరిప్రసాద్ ను సాంకేతిక నిపుణుడిగా పంపడం పట్ల ఈసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ ఏపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, హరిప్రసాద్ బదులు ఇతర సాంకేతిక నిపుణులను పంపితే చర్చలు జరుపుతామని ఈసీఐ తన లేఖలో స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు మరోసారి కలవొచ్చని సూచించింది. ఈ మేరకు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్రకుమార్ కు ఈసీఐ ముఖ్య కార్యదర్శి లేఖను పంపారు.