Chandrababu: పల్లె రఘునాథరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా
- పల్లె తనయుడితో మాట్లాడిన సీఎం
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- బుధవారం గుండెపోటుకు గురైన పల్లె
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. గుండెపోటుకు గురైన పల్లె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో, ఆయన కుమారుడు కృష్ణకిశోర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రఘునాథరెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆయన తనయుడికి ఫోన్ చేశారు. పల్లె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి బుధవారం నాడు ప్రచారం చేస్తూ భార్య సమాధి వద్దకు చేరుకోగానే తీవ్రమైన ఛాతీనొప్పితో కుప్పకూలిపోయారు. దాంతో, ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.