UK: వందేళ్ల నాటి ఘోరకలికి ఇప్పుడు సారీ చెబుతున్న బ్రిటన్!

  • జలియన్ వాలాబాగ్ ఘటనపై పశ్చాత్తాపం
  • పార్లమెంటులో బ్రిటీష్ ప్రధాని వ్యాఖ్యలు
  • 1000 మందికి పైగా మరణించిన ఘటన

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జలియన్ వాలా బాగ్ ఉదంతం ఓ మాయనిమచ్చ. అలాంటి విషాదం దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకోలేదు. పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో శాంతియుతంగా సమావేశమైన 20,000 మంది భారతీయులపై బ్రిటీష్ తుపాకులు విరామం లేకుండా నిమిషాల పాటు గర్జించాయి. 1919 ఏప్రిల్ 13న ఈ దారుణం చోటుచేసుకుంది.

 ఆనాడు బ్రిటీష్ సైనికులకు జనరల్ డయ్యర్ నాయకత్వం వహించారు. జలియన్ వాలా బాగ్ మైదానం నుంచి బయటికి వచ్చే అన్నిదారులు మూసివేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు విడిచారు. వారిలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉన్నారు. తెల్లవాళ్ల రాక్షసత్వం నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలు కోల్పోవడం అత్యంత శోచనీయం. ఘటన తర్వాత ఆ బావి నుంచి పెద్దసంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు.

అయితే ఇన్నేళ్ల తర్వాత బ్రిటన్ ప్రభుత్వం జలియన్ వాలా బాగ్ ఉదంతంపై క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే పార్లమెంటులో ప్రకటన చేశారు. ఆ రోజున జలియన్ వాలా బాగ్ లో జరిగిన దారుణానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13కి జలియన్ వాలా బాగ్ ఉదంతానికి వందేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News