: దమ్ము, ధైర్యం ఉంటే తప్పు నిరూపించండి: రఘునందన్
దమ్ము, ధైర్యం ఉంటే ఏ తప్పు చేసానో నిరూపించాలని కేసీఆర్ కు సవాలు చేసారు టీఆర్ఎస్ నుంచి సస్పెండయిన మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునందన్. తాను డబ్బులు తీసుకుంటున్నానంటూ వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసిన రఘునందన్, కేసీఆర్ ను కాపాడటమే తాను చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో డబ్బు దండుకుంటున్నదెవరో అందరికీ తెలుసన్న ఆయన, కాంగ్రెస్ తో పొత్తు సమయంలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు హరీష్ రావు... వైఎస్ తో మంతనాలు జరుపలేదా? అని ప్రశ్నిచారు.
తనను ఓడించేందుకు భూపాల్ రెడ్డి నుంచి 2 కోట్లు హరీష్ తీసుకున్నాడన్న రఘు, తనవద్ద నుంచి హరీష్ రావు తిరుమల కొండమీద డబ్బు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. తాను టీడీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నానన్న పుకార్లలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి హాని చేసే ఏ పనీ చెయ్యనని స్పష్టం చేసారు. తనపై ఆరోపణలు ఋజువు చెయ్యకపోతే టీఆర్ఎస్ నేతల బండారం మొత్తం సీడీల్లో బయటపెడతానంటూ రఘునందన్ హెచ్చరించారు.