Chandrababu: కోడికత్తి ఓడిపోతుందని తెలియగానే కేసీఆర్ ప్రత్యేక హోదా అంటున్నాడు: చంద్రబాబు
- తాడికొండ రోడ్ షోలో సీఎం ప్రసంగం
- కేసీఆర్ పై ధ్వజం
- రాష్ట్రంలో నీకేం పని అంటూ నిలదీత
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా తాడికొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేటి సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి రోడ్ షో అని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కోడికత్తి పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలియడంతో కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాడని విమర్శించారు.
"ప్రత్యేక హోదా నేను కూడా ఒప్పుకుంటున్నానని అంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నావు... ఎన్నికల ముందు ఒప్పుకున్నావు. ఎందుకు ఒప్పుకున్నావు... కోడికత్తి పార్టీ ఓడిపోతుందని తెలియడంతో ఒప్పుకున్నావు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఏమన్నావు? ఏపీకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలన్నావా లేదా? పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకించారా లేదా? పోలవరంపై సుప్రీంకోర్టుకి వెళ్లారా లేదా?" అంటూ నిప్పులు చెరిగారు.