Chandrababu: జగన్, నీ మూర్ఖత్వానికైనా ఓ హద్దుండాలి: చివరి రోడ్ షోలో చంద్రబాబు
- తాడికొండలో ఎన్నికల ప్రచారం ముగించనున్న చంద్రబాబు
- జగన్ ఓ ఉన్మాది
- విపక్షనేతపై విసుర్లు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాడికొండ రోడ్ షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కనీసం ప్రచారానికి చివరిరోజైనా అమరావతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఒప్పందం ఉందని, కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ప్రతిగా జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడని విమర్శించారు. మోదీ కూడా డబ్బులు పంపించాడని, తాను అధికారంలో ఉంటే వచ్చే ఐదేళ్లలో అమరావతి గొప్పగా ఎదిగిపోతుందని, హైదరాబాద్ పడిపోతుందని వాళ్ల భయం అని పేర్కొన్నారు. వీళ్లకు జగన్ సహకరిస్తున్నాడని అన్నారు.
అమరావతి రాజధానిగా ఉండడం జగన్ కు ఇష్టంలేదని, గెలిస్తే రాజధానిని మార్చేస్తానంటున్నాడని మండిపడ్డారు. అమరావతిలో రైతులు భూములిస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మూర్ఖత్వానికి ఓ హద్దు ఉండాలని, జగన్ ఓ ఉన్మాది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.