Chandrababu: జగన్ జీవితాశయం నిజం చేయడం కోసం మన పిల్లల భవిష్యత్ పాడుచేసుకుంటామా?: పిఠాపురం రోడ్ షోలో చంద్రబాబు
- ఒక్క చాన్స్ అంటున్నాడు
- ఒక్కసారి కదా అని బావిలో దూకుతారా?
- ఒక్కసారి కదా అని కరెంటు తీగలు పట్టుకుంటారా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిఠాపురం రోడ్ షోలో విపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అనే మాట తప్ప మరొకటి మాట్లాడడంలేదని అన్నారు. సీఎం అవడం తన జీవితాశయం అని జగన్ చెబుతున్నాడని, అతడి జీవితాశయం నిజం చేసేందుకు మన పిల్లల భవిష్యత్ పాడుచేసుకుంటామా? అని మండిపడ్డారు. ఒక్క చాన్స్ కదా అని కరెంటు తీగలు పట్టుకుంటామా?, ఒక్క చాన్స్ కదా అని బావిలో దూకుతామా? ఒక్క చాన్స్ కదా అని ఆత్మహత్య చేసుకుంటారా? ఒకేసారి కదా అని విషం తాగుతారా? అంటూ ప్రశ్నించారు.
జగన్ లోటస్ పాండ్ లోనే ఉంటే మంచిదని, అక్కడే ఉంటూ కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడని, ఆ పుణ్యం ఇద్దరూ పంచుకుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ఈ నాలుగు రోజులు కష్టపడాలని, అవతలి వ్యక్తుల డబ్బులు చూసి భయపడవద్దని అన్నారు. సీఎం చంద్రబాబు తన ప్రసంగం చివర్లో వినమ్రంగా అందరికీ వందనం చేశారు. తనకంటే చిన్నవాళ్లకు కూడా పాదాభివందనం చేస్తున్నానని, మీరు చూపే అభిమానంతో మరింత శక్తి పుంజుకుంటానని చెప్పారు.