Jagan: ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుందో వివరించిన జగన్!
- ఇన్ కమ్ ట్యాక్స్ ఉండదు
- జీఎస్టీ చెల్లించాల్సిన పనిలేదు
- రాష్ట్రానికి అన్నీ వస్తాయి
గాజువాక రోడ్ షోలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్ తన ప్రసంగం యావత్తు సీఎం చంద్రబాబుపై విమర్శలతోనే సరిపెట్టారు. మధ్యలో తన మేనిఫెస్టో గురించి వివరించిన జగన్, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏమేం వస్తాయో, ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిపారు.
"ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, హోటళ్లు వస్తాయి. అత్యాధునిక హాస్పిటళ్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం కాబట్టి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేపని ఉండదు, జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. భారీ రాయితీలు ఉంటాయి కాబట్టి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ గా మారుతుంది. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం వస్తుంది" అని వివరించారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తమను రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో గెలిపిస్తే ఇతర ఎంపీల మద్దతుతో ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. అందుకే వైసీపీని గెలిపించాలని కోరుతున్నట్టు చెప్పారు. ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటం అని అభివర్ణించిన జగన్, చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు, టీవీ9, టీవీ5 వంటి అమ్ముడుపోయిన చానళ్లన్నింటితో యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.