Jagan: డ్వాక్రా మహిళలు కడుతున్న వడ్డీలెంత? నువ్వు పసుపు-కుంకుమ కింద ఇస్తున్నదెంత?: చంద్రబాబును నిలదీసిన జగన్
- పసుపు-కుంకుమ పథకం ఓ డ్రామా
- సున్నా వడ్డీ రద్దు చేశారు
- అనకాపల్లి రోడ్ షోలో జగన్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి రోడ్ షోలో సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2016 నుంచి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశారని ఆరోపించారు. ఈ మూడేళ్ల కాలంలో సున్నా వడ్డీ పథకం రద్దు ద్వారా డ్వాక్రా మహిళలు లక్షల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. పసుపు-కుంకుమ పేరిట ఇస్తున్న నిధుల కంటే ఆ అక్కచెల్లెమ్మల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న వడ్డీలే ఎక్కువగా ఉన్నాయని జగన్ మండిపడ్డారు.
ఓ డ్వాక్రా గ్రూపు రూ.5 లక్షల లోన్ తీసుకుంటే వాళ్లు సంవత్సరానికి రూ.1.80 లక్షలు వడ్డీ కడుతున్నారని, రూ.7 లక్షలు తీసుకుంటే రూ.2.52 లక్షలు వడ్డీ అవుతోందని, ఇక రూ.10 లక్షల లోన్ తీసుకున్న గ్రూపు వడ్డీనే రూ.3.60 లక్షలు కడుతున్నారని అన్నారు.
ఇప్పుడీ పెద్దమనిషి పసుపు-కుంకుమ అని డ్రామా పెట్టి ఎన్నికలకు వారం ముందు ఓ డ్వాక్రా గ్రూపుకు కేవలం లక్ష రూపాయలు పసుపు-కుంకుమ కింద ఇస్తూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమలులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసి, ఆ సున్నా వడ్డీ పథకం ద్వారా వచ్చే లబ్దిలో కొంత కూడా ఇవ్వకుండా అందరినీ మోసం చేస్తున్నాడంటూ సీఎం చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు.