Chandrababu: టీడీపీలోకి వచ్చిన తర్వాత మారతాడనుకున్నా, కానీ మారలేదు: చీరాల రోడ్ షోలో ఆమంచిపై చంద్రబాబు వ్యాఖ్యలు
- ఆమంచిపై 28 కేసులున్నాయి
- కేసుల విషయంలో జగన్ తో పోటీపడుతున్నాడు
- వైసీపీ గెలిస్తే వీళ్లకు ఫుల్ లైసెన్స్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చీరాల రోడ్ షోలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమంచిపై 28 కేసులున్నాయని, కేసుల విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పోటీపడుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్లకు ఫుల్ లైసెన్స్ ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. ఆమంచి రౌడీయిజం చేశాడంటూ ఆరోపించారు.
టీడీపీలోకి వచ్చిన తర్వాత మారతాడని భావించామని, కానీ మారలేదని చంద్రబాబు వెల్లడించారు. పధ్ధతిగా ఉండకపోతే వదిలిపెట్టేది లేదని హెచ్చరించామని, కేసులు పెట్టామని చెప్పారు. తాము కఠినంగా వ్యవహరించడంతో తనకు బాగా సూటయ్యే వైసీపీలో చేరాడని విమర్శించారు. ఇలాంటి అభ్యర్థులతో సంక్షేమం జరగదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోడికత్తి పార్టీని నమ్ముకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.