Chandrababu: ఇన్ని తప్పుడు పనులకు తెగిస్తారా?: చంద్రబాబు మండిపాటు!
- బీజేపీ అండతో రెచ్చిపోతున్న వైసీపీ
- కోడికత్తి పార్టీ అక్రమాలను అడ్డుకోండి
- టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
బీజేపీ అండ చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు పనులకు తెగిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అసహనం పెరిగిపోయిన జగన్ బ్యాచ్, ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 'ఎలక్షన్ మిషన్ 2019'పై మాట్లాడిన ఆయన, కరెన్సీ నోట్లను అహంభావంతో వెదజల్లిన వైసీపీ నేతలను ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. కోడికత్తి పార్టీ ఆగడాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైసీపీ ఎంతకైనా తెగించేందుకు సిద్ధ పడిందని, గెలుపు టీడీపీదని, ఏక పక్షమని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు ప్రలోభాలకు దిగడంతో పాటు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
జగన్ కు తోడుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ, అమిత్ షాలు కలిశారని, వారు ముగ్గురూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేవలం అధికారులను బదిలీ చేసినంత మాత్రాన అధికారాన్ని టీడీపీ నుంచి దూరం చేయలేరని హెచ్చరించిన చంద్రబాబు, ఎంతమందిని బదిలీ చేసినా, విజయం మనదేనని కార్యకర్తలు, నాయకులకు ఉద్బోధించారు. ప్రజల అండదండలు టీడీపీకి పుష్కలంగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.