Chandrababu: నువ్వు చంపేదీ లేదు, చంపించుకునేదీ లేదు: అద్దంకి సభలో చంద్రబాబు వార్నింగ్
- బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు
- నేను రౌడీలకు రౌడీగా ఉంటాను
- రౌడీయిజాన్ని అణచివేస్తాను
ప్రకాశం జిల్లా అద్దంకి బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీళ్ల అవినీతి డబ్బులతో టీడీపీ కార్యకర్తలను కొంటామని చెబుతున్నారని, బూత్ లెవల్ ఏజంట్లను కూడా కొనేస్తామంటూ కండకావరం ప్రదర్శిస్తున్నారని, ఒళ్లు బాగా కొవ్వెక్కి, పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
"ఒకాయన చంపడమో, చంపించుకోవడమో అని వ్యాఖ్యానిస్తున్నాడు. నువ్వు చంపేదీ లేదు, చంపించుకునేదీ లేదు, శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాం ఏమనుకుంటున్నారో!" అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీ అన్నవాడు లేకుండా చేస్తానని, రౌడీయిజం చేయాలని ఎవరైనా ముందుకు వస్తే అణచివేస్తానని, తాను రౌడీలకు రౌడీగా ఉంటానని ఉద్ఘాటించారు.
"నా దగ్గర రౌడీయిజం చేయడం వైఎస్ కే చేతకాలేదు. 24 బాంబులేసి చంపాలని ప్రయత్నంచారు, ఏమీ చేయలేకపోయారు. రౌడీల తోక కట్ చేస్తా! ఇతరుల పెత్తనం ఇక్కడ జరగడానికి లేదు" అని స్పష్టం చేశారు. వైసీపీ గెలిస్తే వీధికో కీచకుడు తయారవుతాడని చంద్రబాబు అన్నారు.