Chandrababu: వ్యవసాయం చేశావా? వ్యాపారం చేశావా? కోడిపందాలు వేశావా?: జగన్ ను నిలదీసిన చంద్రబాబు
- ఎవరిచ్చారు నీకు?
- ఏంచేస్తే నీకా డబ్బులు వచ్చాయో చెప్పాలి!
- గిద్దలూరు సభలో చంద్రబాబు ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో వాడీవేడి మరింత పెంచారు. ఈ ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థులుగా మోదీ, కేసీఆర్, జగన్ లను భావిస్తున్న ఆయన, ఒక్కొక్కరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు సభలో కూడా తనదైనశైలిలో ధ్వజమెత్తారు. తాను ప్రజల సంక్షేమం కోసం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు విడుదల చేస్తుంటే వాటిని కూడా అడ్డుకునేందుకు జగన్ తయారయ్యాడని మండిపడ్డారు.
"నేను ఈ నెలంతా ఎన్ని విధాలుగా సాయపడగలనో అంతా చేస్తాను. కానీ, తెలంగాణ నుంచి వస్తున్న పాపిష్టి సొమ్ము మనకు అవసరమా? నరేంద్ర మోదీ ఇచ్చే డబ్బు మనకు అవసరమా? రూ.1000 కోట్లు ఇచ్చి లక్ష కోట్లు ఎగ్గొడుతున్నారు, న్యాయమా ఇది? దీనికి ఒప్పుకుంటామా? ఎక్కడి నుంచి వచ్చాయి జగన్ నీకీ డబ్బులు? సంపాదించావా? లేక, కోడిపందాలు వేశావా? వ్యవసాయం చేశావా? వ్యాపారం చేశావా? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి! కేసీఆర్ ఇచ్చాడా? లేదా? మోదీ ఇచ్చాడా? లేదా? ఈ పవిత్రమైన గడ్డమీద ఆ పాపిష్టి డబ్బులు వస్తే మనకు కూడా పాపం వస్తుంది" అంటూ విమర్శల వర్షం కురిపించారు.