Telugudesam: వాణిజ్య ప్రకటనల కోసం టీడీపీ, వైసీపీ ఎన్ని కోట్లు ఖర్చు చేశాయో చూడండి!
- టాప్ పొజిషన్ లో సైకిల్ పార్టీ
- ద్వితీయస్థానంలో బీజేపీ
- వివరాలు తెలిపిన గూగుల్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఓవైపు ఇంటింటికీ తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాలతో పాటు ఆన్ లైన్ లో వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకే, గూగుల్ లో ఎక్కడ చూసినా ఫలానా గుర్తుకే ఓటేయండి అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. యూట్యూబ్ లోనూ యాడ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఇండియా ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ ప్రకారం వాణిజ్య ప్రకటనల కోసం ఫిబ్రవరి 19 నుంచి ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో వివరాలు వెల్లడయ్యాయి.
ఈ జాబితాలో టీడీపీ ప్రథమస్థానంలో ఉంది. ఆ పార్టీ మొత్తం 89 యాడ్స్ కోసం రూ.1.48 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత జాతీయపార్టీ బీజేపీ 554 వాణిజ్యప్రకటనల కోసం రూ.1.21 కోట్ల మేర కేటాయించింది. కమలనాథుల తర్వాత స్థానంలో ఉన్న వైసీపీ 107 యాడ్స్ కోసం రూ.1.04 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ కోసం ప్రమన్యా స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిటెంట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా వాణిజ్య ప్రకటనలు రూపొందించాయి.
ఆశ్చర్యకరంగా, దేశంలో అతిపెద్ద పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ తన ఆన్ లైన్ ప్రచారం కోసం యాడ్స్ రూపేణా ఖర్చు చేసింది కేవలం రూ.54,100 అంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ కేవలం 14 యాడ్స్ తో గూగుల్ లో ప్రచారం చేసుకుంటోంది.