Jagan: ఆ సమయంలో నేను మా పిల్లల చదువుకోసం బెంగళూరులో ఉన్నాను: జగన్
- అప్పుడు ఎమ్మెల్యేని కాను, ఎంపీని కాను
- సెక్రటేరియట్ కు కూడా వెళ్లలేదు
- నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట ఇండియా టుడే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తాను అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలను జగన్ ఖండించారు.
"మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేని కాను, ఎంపీని కాను. కనీసం సెక్రటేరియట్ కు కూడా ఎప్పుడూ వెళ్లలేదు. అంతెందుకు, నేను ఆ సమయంలో హైదరాబాద్ లో కూడా లేను. మా పిల్లల చదువు కోసం బెంగళూరులో ఉండేవాడ్ని. సరిగ్గా చెప్పాలంటే, మా నాన్న పోయిన తర్వాతే ఈ కేసులన్నీ పెట్టారు. అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు కేసుల్లేవు. మా నాన్న పోవడంతో కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే కేసులు పెట్టారు. రాజకీయ కక్షతో కాంగ్రెస్, టీడీపీ లాలూచీ పడి పెట్టిన అక్రమ కేసులవి.
ఇప్పుడు నాకు ప్రజలే ముఖ్యం. కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకునే ఆలోచనే లేదు. చంద్రబాబు కూడా నాకు శత్రువు కాదు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే మంచి సీఎంగా పనిచేస్తాను. ప్రజల సంతోషమే పరమావధిగా భావిస్తాను.
ఇక, ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను. అంతేతప్ప, మాకు ఎవరితో పొత్తులేదు. మేం ఏపీలో 25 లోక్ సభ సీట్లు గెలిచి, తెలంగాణలోని 17 సీట్లు కూడా తోడైతే 42 సీట్లతో కేంద్రాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగి ప్రత్యేక హోదా సాధించే వీలుంటుంది.
మేం అధికారంలోకి వస్తే చంద్రబాబుపై ఉన్న ఆరోపణలపై తప్పకుండా విచారణ జరిపిస్తాం. నేరస్తులు జైలుకు వెళ్లాల్సిందే. నేను చంద్రబాబుపై ప్రత్యేకంగా కేసులు పెట్టాల్సిన పనిలేదు. ఆయన ఆల్రెడీ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. నల్లధనంతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలని చూసిన వ్యక్తిని వదిలిపెట్టాలా?" అంటూ జగన్ ప్రశ్నించారు.