Chandrababu: సినిమా డైలాగులు కొట్టడం ఆపి మోహన్ బాబు ఇంట్లో కూర్చుంటే మంచిది: బుద్ధా హితవు
- ఏదో ఒక అండ కోసమే వైసీపీలో చేరారు
- వయసు మీద పడింది... నోరు అదుపులో ఉంచుకోవాలి
- చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు
ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుపై విరుచుకుపడ్డారు. మోహన్ బాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని బుద్ధా తప్పుబట్టారు. చంద్రబాబును విమర్శించే స్థాయి మోహన్ బాబుకు లేదని, ఆయన సినిమా డైలాగులు వల్లించడం ఆపేసి ఇంట్లో కూర్చుంటే ఎవరికీ అభ్యంతరంలేదని అన్నారు. అలాకాకుండా చంద్రబాబు గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే తాము మరింత ఘాటుగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్ధా, ఓవైపు మోహన్ బాబు అన్నగారి పేరు చెప్పుకుంటూనే ఆయన పార్టీ వారసుడైన చంద్రబాబును విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. వయసు పైబడిన వ్యక్తి సంయమనంతో మాట్లాడాలని, సీఎంను తిడితే గొప్పవాడ్నయిపోతానని మోహన్ బాబు అనుకుంటున్నట్టుందని విమర్శించారు. ఈ దశలో ఏదో ఒక పార్టీ దన్ను కోసమే వైసీపీలో చేరిన మోహన్ బాబు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రోడ్డెక్కి తనకు ఏమాత్రం సంబంధంలేని పసుపు-కుంకుమల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు.