Jagan: కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది మోదీయే: జగన్
- కియా రాకముందే రైతుల నుంచి భూములు తీసుకున్నారు
- సీఎం హోదాలో ఒక్క హామీ నెరవేర్చలేదు
- ఎన్నికల ప్రచారంలో జగన్ విసుర్లు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. శుక్రవారం కోర్టుకు హాజరైన ఆయన శనివారం మళ్లీ ఎన్నికల రోడ్ షోల్లో పాల్గొంటూ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు. ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహించిన జగన్ తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
మడకశిరలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కియా మోటార్స్ ను తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, కానీ కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు. ప్రధాని వల్లే కియా అనంతపురానికి వచ్చిందని అన్నారు. అయితే కియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు భూకుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. కియా మోటార్స్ రాకముందే అనంతపురంలో రైతుల నుంచి భూములు తీసేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఒక్క కంపెనీ కానీ, పెట్టుబడి కానీ ఏపీకి రాలేదని అన్నారు.
సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళలందరినీ మోసం చేశారంటూ జగన్ మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అందరినీ మోసం చేశారని, కనీసం 6000 స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో కులానికో పేజీ పెట్టి అందరినీ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తాగునీళ్లు ఇవ్వరు కానీ నదుల్లో ఉన్న ఇసుకను మాత్రం దోచేస్తారని మండిపడిన జగన్, ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళితే చంద్రబాబు ఏంచేశారో చెప్పాలని నిలదీశారు.