Chandrababu: ఇచ్ఛాపురం పర్ఫెక్ట్ వాస్తు... కుప్పం వరకు మొత్తం మనదే: చంద్రబాబు ధీమా
- ఇచ్ఛాపురంలో ఒక్కసారే ఓడిపోయాం
- కుప్పంలో మనకు ఎదురేలేదు
- ఉత్సాహంగా ప్రసంగించిన టీడీపీ అధినేత
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. జనసంద్రాన్ని తలపిస్తున్న సభను చూడగానే చంద్రబాబు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. సముద్రంలా కనిపిస్తున్నారని, తన జీవితంలో ఇంతటి జనస్పందన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇచ్ఛాపురం రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యంగా ఉంటుందని, రాష్ట్రానికి పర్ఫెక్ట్ వాస్తు అని పేర్కొన్న చంద్రబాబు, ఇక్కడ పోటీచేస్తున్న అశోక్ టీడీపీ అభ్యర్థుల లిస్టులో మొదట ఉంటాడని, కుప్పంలో పోటీచేస్తున్న తాను చివర 175వ స్థానంలో ఉంటానని వివరించారు.
జాబితాలో మొదట, చివర ఉండే ఇద్దరు అభ్యర్థులం ఇప్పుడు ఒకే వేదికపై ఉన్నామని చమత్కరించారు. అంతేకాదు, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు అన్నీ మనమే గెలుస్తున్నామంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేలా మాట్లాడారు. ఇచ్ఛాపురం టీడీపీకి కంచుకోట అని చెప్పారు. ఒక్కసారి తప్ప ఇచ్ఛాపురంలో టీడీపీకి అనేక ఘనవిజయాలు లభించాయని అన్నారు. కుప్పంకు తాను వెళ్లకపోయినా 70 వేలు, 80 వేలు మెజారిటీ వస్తుంటుందని వివరించారు.