Congress: వైసీపీ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఈసీ, తెలంగాణలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: దాసోజు శ్రవణ్
- తెలంగాణలో ఓట్ల తొలగింపు కనిపించలేదా?
- కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారు
- మండిపడిన కాంగ్రెస్ నేత
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎన్నికల సంఘం పనితీరును తప్పుబట్టారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ఈసీ, ఏపీలో అధికారులను బదిలీ చేసిందని, మరి తెలంగాణలో ఓట్ల తొలగింపు జరిగిందని చెబుతున్నా ఎందుకు స్పందించడం లేదని శ్రవణ్ నిలదీశారు.
లక్షల ఓట్లు తొలగించిన విషయం సంచలనం సృష్టిస్తున్నా ఈసీకి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని, ఆ అసహనాన్ని ఉద్యోగులపై చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారంటూ కేసీఆర్ వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.