Andhra Pradesh: ఎస్పీల బదిలీపై హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా

  • ఫిర్యాదుల ఆధారంగానే ఎస్పీల బదిలీ
  • పిటిషన్ వేసే హక్కు ప్రభుత్వానికి లేదు
  • వాదనలు వినిపించిన ఈసీ న్యాయవాది

మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ మొదలవగా, ఇరుపక్షాలు వాదోపవాదాలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అంతకుముందు, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. న్యాయపరంగా ముందుకెళ్లాలని భావించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు.

ఫిర్యాదులు వచ్చినందునే ఆ ఇద్దరు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని, ఈ విషయంలో పిటిషన్ వేసే అర్హత ఏపీ గవర్నమెంటుకు లేదని కోర్టుకు తెలిపారు. అసలు ఈ పిటిషనే విచారణకు అనర్హం అని పేర్కొన్నారు.  ఇదే కేసులో వైసీపీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో వారి తరఫు వాదనలను కూడా న్యాయమూర్తి అనుమతించారు. ఆ పార్టీ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వాదనలను సావధానంగా విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News