Andhra Pradesh: ఏపీ అంతా టీడీపీకి మంచి ఊపు ఉంది.. వైసీపీని ఓ ఆట ఆడుకోవాలి!: సీఎం చంద్రబాబు
- ఎన్నికల పోరాటానికి కార్యకర్తలు కమాండర్ లా తయారవ్వాలి
- కాపు రిజర్వేషన్ విషయంలో జగన్ నాటకాలు
- టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోరాటానికి ప్రతీ కార్యకర్త కమాండర్ లా తయారుకావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇది రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న ప్రజాపోరాటమని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై న్యాయం చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
జగన్ ద్వారా ఆంధ్రాను దోచుకునేందుకు సిద్ధమైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా టీడీపీకి మంచి ఊపు ఉందనీ, ఇదే అదనుగా వైసీపీని ఓ ఆట ఆడుకోవాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్ అరాచక శక్తి అని చెప్పడానికి ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న కేసులే నిదర్శమని స్పష్టం చేశారు.
సమాజంలో నేరస్తుడిని నేరస్తుడిగా చూస్తామనీ, కానీ జగన్ మాత్రం రాజకీయ నేతగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఏపీలో అరాచకాలు రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారనీ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు.