: కిడ్నీలకు ట్రాఫిక్ ట్రబుల్...!
ట్రాఫిక్ వల్ల మనకు అటు పనికి చేటు, ఇటు మూత్రపిండాలకు కూడా చేటు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. దీనివల్ల అటు రాకపోకలకు ఇబ్బందే కాకుండా వాతావరణ పరంగా కూడా కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటోంది. అయితే ఈ కాలుష్యం వల్ల మూత్రపిండాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.
ట్రాఫిక్ వల్ల వచ్చే కలుషితమైన గాలిని పీల్చడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదముందని ఇప్పటికే ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ తాజా అధ్యయనం గుండెకు మాత్రమే కాకుండా మూత్రపిండాల పనితీరుపై కూడా ట్రాఫిక్ కాలుష్యం ప్రభావం చూపుతుందని తేల్చింది.
బోస్టన్‌లోని బెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ సెంటర్‌కు చెందిన వైద్య నిపుణులు సుమారు 1100 మంది స్ట్రోక్ రోగులపై అధ్యయనం చేశారు. వీరిలో సగంమంది రోడ్డుకు కిలోమీటరు దూరంలోపు వుండగా, మిగిలినవారు రోడ్డుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు. వీరికి జీఎఫ్‌ఆర్ పరీక్ష నిర్వహించి వీరి మూత్రపిండాల పనితీరును పరిశీలించారు. ఇందులో రోడ్డుకు దగ్గరగా వున్నవారి మూత్రపిండాల పనితీరు తక్కువగా ఉన్నట్టు తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని ఎపిడెమియోలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ అనే పత్రికలో ప్రచురించారు. కాబట్టి రోడ్డు పక్కనే నివాసం ఉంటున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండండి...!