Tollywood: దమ్ముంటే వాళ్లను తీసుకురండి... నౌఖరు వేషం వేయడానికైనా నేను రెడీ: కోట శ్రీనివాసరావు
- పరభాషా నటులంటే ఇష్టంలేక కాదు
- మనవాళ్లను తక్కువ చేసి చూడొద్దు
- 'మా' ప్రమాణ స్వీకారోత్సవంలో కోట ఫైర్
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రధాన పాత్రలు తెలుగు నటీనటులకే దక్కాలంటూ ఎప్పట్నించో పోరాడుతున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. తాజాగా, మా కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు ఆర్టిస్టులకు నెలలో పన్నెండు రోజులైనా ఉపాధి ఉండేలా చూడాలని 'మా' నూతన కార్యవర్గానికి విజ్ఞప్తి చేశారు. కనీసం పది రోజులైనా పని ఉండేట్టు చేయగలిగితే కృష్ణా నగర్ లో రోడ్డున పడకుండా తమ బతుకేదో తాము బతుకుతారని అన్నారు. అలాకాకుండా పరభాషా నటులను తీసుకువచ్చి వాళ్లకు లక్షలు లక్షలు ఇస్తుంటే వాళ్లేమో హాయిగా హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకుంటున్నారని, మనవాళ్లేమో తినడానికి తిండిలేక నెలనెలా పెన్షన్ కోసం చూస్తున్నారని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను 'సామి' అనే తమిళ సినిమా కోసం చెన్నై వెళితే మంచి హోటల్ లో రూమ్ బుక్ చేయకుండా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కానీ, తెలుగువాళ్లు మాత్రం పరాయిభాషల నటులను, వాళ్ల అసిస్టెంట్లను విమానాల్లో తీసుకువచ్చి రాచమర్యాదలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పరభాషా నటులకు వ్యతిరేకం కాదని, కానీ కనీస స్థాయిలేనివాళ్లను తీసుకువచ్చి తమకంటే మంచి పాత్రలు ఇవ్వడం సరికాదన్నది తన అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు. దమ్ముంటే నానా పాటేకర్, అమితాబ్ బచ్చన్ స్థాయి నటీనటులను తీసుకువస్తే వారివద్ద నౌఖరు వేషం వేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.