Telugudesam: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన చంద్రబాబు
- తాడేపల్లిలో ఓటేసిన సీఎం
- తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
- ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని పరిధిలోని తాడేపల్లి ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో చంద్రబాబు నేడు ఓటేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు గుంటూరు-కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు ఉపాధ్యాయ స్థానాలతో పాటు మరో పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.