YSRCP: ఆత్మహత్య చేసుకుంటానంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ సెల్ఫీ వీడియో
- జగన్ పై అలక
- కలిసేందుకు అవకాశం ఇవ్వడంలేదు
- చనిపోయేవాళ్లు నిజమే చెబుతారంటూ వ్యాఖ్యలు
పూతలపట్టు శాసనసభ్యుడు సునీల్ తనకు ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోలో బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా తనకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సునీల్ మనస్తాపానికి గురయ్యారు. జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో మొదట ఓ సెల్ఫీ వీడియోలో బాధపడిన సునీల్... తాజాగా రూపొందించిన సెల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ తనపై వచ్చిన ఆరోపణలు దారుణమని అభిప్రాయపడ్డారు. తనకు జగన్ అంటే ప్రాణం అని, ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చారని సునీల్ తెలిపారు. ప్రతిరోజు లేవగానే సాక్షి పేపర్లో గానీ, వాట్సాప్ లో గానీ, ఇతర సోషల్ మీడియా సైట్లలో గానీ మీ ముఖం చూస్తే గానీ సంతోషం కలగదని జగన్ పై తన అభిమానాన్ని ప్రదర్శించారు.
కానీ కొందరు నాయకులు ఈ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టే జగన్ టికెట్ ఇవ్వకుండా దూరం పెడుతున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, జగన్ ఈ విషయంలో తనను అపార్థం చేసుకుంటే భరించలేనని స్పష్టం చేశారు. తాను ఎంతో అభిమానించే జగన్ మనసు చూరగొనలేకపోయానన్న బాధ తనను దహించి వేస్తోందని అన్నారు.
తాను ఓ డాక్టర్ నని, తాను మానసికంగా ఎంతో దృఢంగా ఉంటానని చెబుతూ... నిజాయతీగా ఉండాలని ప్రయత్నించినా వీలుకాకపోవడంతోనే ఈ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. దయచేసి అందరూ జగన్ కు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నానని చెబుతూ వీడియో ముగించారు సునీల్. చనిపోయేవాళ్లు నిజమే చెబుతారంటారని, ఇప్పుడు తాను చెప్పేది కూడా నిజమని నమ్మాలంటూ విజ్ఞప్తి చేశారు.