YSRCP: ఈ హత్యలు ఎవరు చేయిస్తున్నారో భగవంతుడికి తెలుసు: మోహన్ బాబు
- ఎవరికీ అన్యాయం చేయని వ్యక్తి వివేకా
- ఆయన్ని చంపిన రాక్షసుడ్ని న్యాయబద్ధంగా పట్టుకోవాలి
- వివేకా మృతిపై దిగ్భ్రాంతి చెందిన సీనియర్ నటుడు
వైఎస్ కుటుంబంలో ప్రస్తుతం కుటుంబ పెద్దగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లోనే హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వివేకాతో బంధుత్వం ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కదిలిపోయారు. శుక్రవారం వివేకా భౌతికకాయం వద్ద విషణ్ణ వదనంతో కనిపించారు మోహన్ బాబు. వివేకా మృతిపై ఆయన మాట్లాడుతూ, ఈ ఘోరాలు చేస్తున్నది ఎవరో భగవంతుడు చూస్తూనే ఉన్నాడని, ప్రకృతి వాళ్లను తప్పకుండా శిక్షిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఈ ఘోరాలు, అరాచకాలకు పాల్పడుతున్నది ఎవరో ఆ భగవంతుడికి తెలుసని వ్యాఖ్యానించారు.
పదిమందికి సాయం చేసే మంచి మనసున్న వివేకా లాంటి వ్యక్తికి ఇంత దారుణం జరగడం కలచివేస్తోందని మోహన్ బాబు తీవ్రభావోద్వేగాలకు గురయ్యారు. వివేకా తనకు బంధువు అని, ఆయన చాలా సాధారణ జీవనం సాగించే వ్యక్తి అని చెప్పిన మోహన్ బాబు... ఆయన్ను చంపిన రాక్షసుడ్ని త్వరలోనే పట్టుకుని చట్టం ముందుకు తీసుకురావాలని కోరారు. అయితే, ఈ క్రమంలో పోలీసులు, ఇతర అధికారులు వాస్తవాలను వెలికితీయాలని, నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేయకుండా హంతకుడ్ని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పక్షపాతం చూపిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో పగలు, రేయి ఉంటాయన్న విషయం మర్చిపోకూడదని హెచ్చరించారు మోహన్ బాబు.