YSRCP: సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ కు వివేకా హత్య కేసు పర్యవేక్షణ బాధ్యతలు!
- దర్యాప్తు కోసం 5 బృందాలు
- విజయవాడ నుంచి బయల్దేరిన 3 బృందాలు
- క్లూస్ టీమ్ శోధన కొనసాగుతోందన్న ఎస్పీ
వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టంలో తేలడంతో ఈ కేసులో నిగ్గు తేల్చేందుకు సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. వివేకా కేసులో సత్వర దర్యాప్తు కోసం మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేశారు ఏపీ డీజీపీ ఠాకూర్. ఇప్పటికే విజయవాడ నుంచి 3 ప్రత్యేక బృందాలను సంఘటన స్థలానికి పంపించారు. ఈ బృందాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ అమిత్ గార్గ్ కు అప్పగించినట్టు డీజీపీ తెలిపారు.
కాగా, వివేకా హత్యోదంతంలో క్లూస్ టీమ్ ఆయన గదిలో కొన్ని వేలిముద్రలు, పాదముద్రలు సేకరించినట్టు కడప ఎస్పీ రాహుల్ తెలిపారు. తాము సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని అన్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఘటన రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఇంటికి ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరాతీస్తున్నామని చెప్పారు ఎస్పీ. ప్రస్తుతం క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాల కోసం శోధిస్తోందని వెల్లడించారు.