Chandrababu: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిలిపివేయాలంటూ సీఈవోకి ఫిర్యాదు చేసిన యామిని సాధినేని
- చంద్రబాబును చెడుగా చూపించారు
- ఆయన ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉంది
- ఫిర్యాదులో పేర్కొన్న టీడీపీ నేతలు
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిలిపివేయాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, యామిని సాధినేని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుప్రతిష్ఠలు దెబ్బతినేలా సినిమా చిత్రీకరించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతల్లో గౌతు శిరీష, సతీష్ తదితరులు ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ లోనే చంద్రబాబును చెడుగా చూపించారని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ వీడియోను ఎన్నికల సంఘానికి అందజేశామని చెప్పారు.
ఇదిలావుంచితే, కొన్నిరోజుల క్రితం కూడా దేవిబాబు చౌదరి అనే టీడీపీ నేత ఎన్నికల సంఘానికి ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను నెగెటివ్ గా చూపించారని, ఇది ఓటర్లపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.