Telugudesam: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తీసేయాలి... అవి వైసీపీ గుర్తులు!: రామకుప్పం టీడీపీ నేతల డిమాండ్
- ఫిర్యాదు చేసిన స్థానిక నేతలు
- చంద్రబాబు చిత్రపటాలు తీసేయడంపై ఆగ్రహం
- నిబంధనలు సమానంగా వర్తింపచేయాలంటూ పట్టు
ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. సమయం చాలా తక్కువగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు ఓవైపు ప్రచారం సాగిస్తూనే మరోవైపు ప్రత్యర్థులను కూడా ఓ కంట గమనిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రామకుప్పం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫ్యాన్లను తీసేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనీ, ఎన్నికల గుర్తును సూచించే వస్తువులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండరాదని టీడీపీ నాయకులు అంటున్నారు. దీనిపై తహసీల్దార్ జనార్దన్ శెట్టికి ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదును పరిశీలించిన ఆయన ఈ వ్యవహారాన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. రామకుప్పం టీడీపీ నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న చంద్రబాబు ఫొటోలను అధికారులు తొలగించారు. దాంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తీసేయాలంటూ, అవి వైసీపీ గుర్తులని చెబుతూ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలంటూ కోరుతున్నారు.