Telugudesam: యామిని సాధినేని పోటీపై టీడీపీ వర్గాల్లో కొనసాగుతున్న సందిగ్ధత
- కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న యామిని
- ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం
- పోటీ చేయడంపై రాని స్పష్టత
కొంతకాలం కిందట వరకు ఓ హ్యామ్ రేడియో ఆపరేటర్ గా ఉన్న యామిని సాధినేని ఇప్పుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తనకంటే ముందు నుంచి పార్టీలో ఎంతోమంది మహిళా నేతలు ఉన్నా వారెవరికీ రాని పేరు యామినికి వచ్చింది. అందుకు కారణం ఆమె దూకుడే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంతటివాడిని సైతం టార్గెట్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది యామిని.
ఎలాంటి అంశంపై అయినా స్పష్టమైన ఆలోచనలతో మాట్లాడే ఈ ఉన్నత విద్యావంతురాలు కొద్దికాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే, ఎన్నికల నేపథ్యంలో యామిని సాధినేని పోటీ చేస్తుందా? చంద్రబాబు ఆమెకు టికెట్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే యామిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మీడియాలో ఈ మేరకు కథనాలు కూడా వస్తున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈసారి టీడీపీకి వీడ్కోలు పలికి వైసీపీలోకి వెళ్లిపోయారు. దాంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీకి సమర్థత ఉన్న నేత అవసరం!
ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని యామిని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే, సామాజిక వర్గాల సమీకరణాలను చూస్తే అన్నిరకాలుగా యామినికి అనుకూలంగానే కనిపిస్తోందంటున్నారు రాజకీయ మేధావులు. ఈ నేపథ్యంలో, గుంటూరు పశ్చిమం టికెట్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.