India: మటన్ లేబుల్ వేసి గొడ్డుమాంసం ఇచ్చారు... తిన్న తర్వాత ఈ ఎన్నారై ఏంచేశాడో చూడండి!
- న్యూజిలాండ్ లో ఘటన
- శుద్ధికరణ కోసం భారత్ వెళతానంటూ మంకుపట్టు
- రానుపోను చార్జీలు ఇవ్వాలంటూ డిమాండ్
న్యూజిలాండ్ లో బార్బర్ గా పనిచేసే జస్వీందర్ పాల్ అనే ఎన్నారైకి ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కొన్నాళ్ల క్రితం బ్లెన్ హీమ్ పట్టణంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లి అక్కడ 'పొట్టేలు పిల్ల మాంసం' అని లేబుల్ వేసున్న శుద్ధిచేసిన మాంసాన్ని కొనుగోలు చేశాడు. కానీ, దాన్ని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా వండుకుని తిని దిగ్భ్రాంతికి గురయ్యాడు. అది గొర్రె పిల్ల మాంసం కాదని, గొడ్డుమాంసం అని రుచిని బట్టి అర్థం చేసుకున్నాడు జస్వీందర్ పాల్. దాంతో, తాను మోసపోయానని భావించి వెంటనే ఆ సూపర్ మార్కెట్ కు వెళ్లి నానా రభస చేశాడు.
బీఫ్ తినడం కారణంగా తాను అపవిత్రుడ్నయ్యానని, భారత్ వెళ్లి శుద్ధికరణ ప్రక్రియ చేయించుకోవాలని, అందుకు గాను రానుపోను చార్జీలు చెల్లించాలని సూపర్ మార్కెట్ వర్గాలను డిమాండ్ చేశాడు. బీఫ్ తినడం కారణంగా తన ఆత్మ కలుషితం అయిందని, హిందూయిజం ప్రకారం తాను సొంతదేశానికి వెళ్లి నాలుగు నుంచి ఆరు వారాల పాటు అనేక క్రతువులు చేయాలని తెలిపాడు. తాను బీఫ్ తిన్నానని తెలిసి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడంలేదని వాపోయాడు జస్వీందర్ పాల్. దాంతో ఆ సూపర్ మార్కెట్ వర్గాలు పాల్ కు క్షమాపణలు చెప్పాయి.
అయితే ఆ బార్బర్ మాత్రం ససేమిరా అంటూ తాను భారత్ వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులు చెల్లించాల్సిందేనని భీష్మించుకున్నాడు. ఈ విషయంలో కోర్టుకు మాత్రం వెళ్లనని, ఎలాగైనా వాళ్ల నుంచే డబ్బులు వసూలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.