Tollywood: మా చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తీరుతాం!: నాగబాబు సెటైర్
- 70 ఏళ్ల వయసులో కూడా ఆయన కష్టపడాలా!
- తన మనవడితో ఆడుకోవాలి కదా!
- మెగాబ్రదర్ సెటైర్ల వర్షం
టాలీవుడ్ మెగాబ్రదర్ నాగబాబు మరోసారి సెటైరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసి హాస్యభరిత వ్యాఖ్యలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం 70 ఏళ్ల వయసు అని, అందరూ 60 ఏళ్లకే విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన మాత్రం ఇంకా కష్టపడాలా? అంటూ సెటైర్ వేశారు.
"ఈసారి మా చంద్రబాబుకు మేం విశ్రాంతి ఇచ్చే తీరతాం. తన మనవడు దేవాన్ష్ తో ఆడుకునే అవకాశం కల్పిస్తాం. అందరూ హాయిగా విశ్రాంతి తీసుకోవాలి కానీ చంద్రబాబు మాత్రం పగలు రేయి తేడాలేకుండా కష్టపడాలి! ఇదేమన్నా న్యాయంగా ఉందా! ఈ వయసులో మనవడితో ఆడుకోవాలని ఆయనకు మాత్రం ఉండదా ఏంటి! 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుపై ప్రజలకు జాలి దయా లేవా? ఉంటే ఆయన్ని ఎందుకిలా కష్టపెడతారు? మళ్లీ మా చంద్రబాబే రావాలి అంటూ ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఈమధ్యే లోకేష్ ఓ మాటన్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా మా నాన్న చాలా కష్టపడుతున్నాడని అన్నాడు.
ఒక కొడుకుగా లోకేష్ బాధపడడంలో తప్పులేదు. అందుకే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారికి విశ్రాంతి ఇస్తాం. తాత దగ్గర ఎలా ఆడుకోవాలో దేవాన్ష్ కూడా తెలుసుకోవాలి కదా! మళ్లీ బాబే రావాలి అని ఎవరైనా కోరుకుంటే వాళ్లకి ఒకటే చెబుతున్నాం... మేం ఆయనకి తప్పకుండా రెస్ట్ ఇచ్చి తీరుతాం, ఆయన్ని మళ్లీ రానివ్వం" అంటూ సెటైర్ల వర్షం కురిపించారు.