Chandrababu: వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా
- రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం
- టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా
- చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు.