Andhra Pradesh: ఏప్రిల్ 11 తర్వాతే సర్వే ఫలితాలు ప్రకటిస్తా: లగడపాటి

  • రాజకీయాల్లో లేను
  • ఎక్కడా పోటీచేయను
  • సలహాలు ఇస్తానంటూ ముక్తాయింపు

తెలుగు రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. వ్యాపారవేత్తగా ఎంతో అనుభవం ఉన్న లగడపాటి రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. కానీ కొన్నిరోజులుగా లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.

దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను ఎక్కడా పోటీ చేయడం లేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నరసరావు పేట ఎంపీగా పోటీచేస్తున్నానని జరుగుతున్న ప్రచారం నిజంకాదని అన్నారు. ప్రస్తుత రాజకీయాలతో తనకు సంబంధంలేదని అన్నారు. ఎవరైనా సన్నిహితులు అడిగితే మాత్రం సలహాలు, సూచనలు ఇస్తున్నానని లగడపాటి తెలిపారు.

అప్పట్లో తాను మెదక్ ఎంపీగా పోటీచేస్తానని చెప్పడాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో మొదటి దశలోనే ఎన్నికలు రావడం శుభపరిణామం అని పేర్కొన్నారు లగడపాటి. కాగా, గత ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేలు చేయిస్తూ అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటున్నారు.

అయితే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వేలు దారుణంగా తప్పడంతో మనస్తాపానికి గురయ్యారు. గతంలో తన సర్వేలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడంతో ఆర్జీ ఫ్లాష్ టీమ్ కు మంచి పేరొచ్చింది. కానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనాన్ని ఊహించడంలో ఆయన బొక్కబోర్లాపడడంతో మొదటిసారి లగడపాటి సర్వేల విశ్వసనీయతపై సందేహాలు మొదలయ్యాయి. అందుకే ఈసారి ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాతే సర్వే ఫలితాలు ప్రకటిస్తానని లగడపాటి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News