Tollywood: 'ఒరు ఆదార్ లవ్' దర్శకుడికి కౌంటర్ ఇచ్చిన ప్రియా వారియర్
- అసలేం జరిగిందో నాకు తెలుసు
- అన్నీ బయటపెడితే మీ పరువే పోతుంది
- సంచలన వ్యాఖ్యలు చేసిన యువ హీరోయిన్
ఒరు ఆదార్ లవ్ అనే మలయాళ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించిందంటే అందుకు ప్రధాన కారణం ప్రియా ప్రకాష్ వారియర్. ఈ స్లిమ్ బ్యూటీ కన్నుగీటిన వీడియో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించింది. ఆ వీడియోనే చివరికి సినిమా బొక్కబోల్తాపడడానికి కారణమైంది! ఆ వీడియో చూసిన జనాలందరూ ఆ సినిమాలో ప్రియానే మెయిన్ హీరోయిన్ అని భావించారు. టాలీవుడ్ లో సైతం ఈ సినిమాకు విపరీతమైన హైప్ లభించింది. మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ప్రియాది సపోర్టింగ్ క్యారక్టర్ మాత్రమే. అయితే, కన్నుగీటే వీడియోతో ప్రియా వారియర్ కు లభించిన పాప్యులారిటీని సొమ్ముచేసుకోవడానికి నిర్మాతలు అత్యుత్సాహం చూపించి స్క్రిప్టులో మార్పులు చేయించారు.
ప్రియా క్యారక్టర్ పెంచి అసలు హీరోయిన్ అయిన నూరిన్ షరీఫ్ క్యారక్టర్ తగ్గించారు. ఆ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టి సినిమా డిజాస్టర్ అయింది. దాంతో చిత్రబృందంలో విభేదాలు బట్టబయలయ్యాయి. తమ సినిమా విఫలం కావడానికి ప్రియా ప్రకాష్ క్యారక్టర్ ను హీరోయిన్ గా మార్చడమే కారణమని దర్శకుడు ఒమర్ లులూ బాహాటంగా విమర్శలు చేయడం కలకలం రేపింది. కథను మార్చి ప్రియాను హీరోయిన్ గా చేయాలని నిర్మాతలు ఒత్తిడి తెచ్చారని, అదే సినిమా కొంపముంచిందని అన్నారు.
అంతేకాదు, హీరోయిన్ నూరిన్ షరీఫ్ కూడా ప్రియా కారణంగా తనకు రావాల్సిన పేరు రాకుండా పోయిందని ఆక్రోశం వెళ్లగక్కింది. దాంతో ప్రియా వారియర్ తీవ్రస్థాయిలో స్పందించింది. తాను గనుక నోరు విప్పితే విమర్శలు చేసేవారి పరువు ఏమవుతుందో ఆలోచించుకోవాలని హెచ్చరించింది. అసలేం జరిగిందో బయటపెడితే ఎవరికీ పేరుప్రతిష్ఠలు మిగలవని స్పష్టం చేసింది. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనపై వస్తున్న విమర్శలన్నింటికీ కాలమే జవాబు చెబుతుందని పేర్కొంది. త్వరలోనే ఆ సమయం ఆసన్నమవుతుందని వ్యాఖ్యానించింది ప్రియా వారియర్.