Andhra Pradesh: ఏపీ ఓటర్లకు విజ్ఞప్తి.. మూడు పూట్లా మీ ఓటు ఉందో? లేదో? చెక్ చేసుకోండి: సీఎం చంద్రబాబు
- ఓటు లేకుండా చేయాలని కొంత మంది చూస్తున్నారు
- ఈ ఐదు రోజులు ఓటర్లందరూ జాగ్రత్తగా ఉండాలి
- ముఖ్యంగా, యువత తమ ఓటు విషయంలో జాగ్రత్త
తమ సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇక్కడి ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో ఓటర్లందరూ ప్రతిరోజూ మూడు పూట్ల చెక్ చేసుకోవాలని సూచించారు.
పొద్దున్న, మధ్యాహ్నం, అలాగే, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తమ ఓటు ఉందో లేదో చూసుకోండని చెప్పారు. అవసరమైతే, రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఓసారి చెక్ చేసుకోవాలని, ఎందుకంటే, ఓటు లేకుండా చేసేందుకు కొంత మంది చూస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ ఐదు రోజుల పాటు ఓటర్లందరూ తమ ఓటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని, ముఖ్యంగా, యువత తమ ఓటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.