Telugudesam: బెజవాడ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా కేశినేని నాని కుమార్తె
- విజయవాడలో కేశినేని శ్వేత పర్యటనలు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ కీలకపాత్ర
- స్థానిక పరిస్థితులపై అవగాహన కోసం ప్రయత్నం
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఒకేసారి రావడంతో నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు బుజ్జగింపులతో పార్టీల హైకమాండ్ లు తలమునకలుగా ఉన్నాయి.
ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో గుండెకాయ వంటి విజయవాడలో ఓ కొత్త ముఖం విపరీతమైన ఆకర్షణగా మారింది. ఆమె ఎవరో కాదు... బెజవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత. యూఎస్ లో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న శ్వేతకు ఆధునిక తరహా రాజకీయ ప్రచారంపై మంచి అవగాహన ఉంది.
నాలుగేళ్ల క్రితం ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ టీమ్ లో శ్వేత కీలక బాధ్యతలు నిర్వర్తించినట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం భారత్ వచ్చిన ఆమె స్థానిక పరిస్థితులు, రాజకీయాలపైనా అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ తో కలిసి విజయవాడలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఆమె ప్రచారంతో టీడీపీకి గణనీయమైన లబ్ది చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూడాలి... కేశినేని తనయ ఎలాంటి మార్పు తీసుకువస్తుందో!