Tollywood: ఇష్టంలేకపోయినా పోటీ చేస్తున్నా: మా అధ్యక్షుడు శివాజీరాజా ఆవేదన

  • మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు
  • అందుకే ప్రజల ముందుకు వచ్చాం
  • నరేష్ ను విమర్శించాలని కాదు

ఓ వైపు తెలుగు రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా ఎన్నికల సందడి ఊపందుకుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మార్చి 10న జరగనున్నాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా వర్గం ఓవైపు, సీనియర్ నటుడు నరేష్ వర్గం మరోవైపు ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరలేపారు.

 ఈ నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. తాజాగా, మా అధ్యక్షుడు శివాజీరాజా గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. నరేష్ ప్యానెల్ మీడియా ముందుకెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని శివాజీరాజా వివరణ ఇచ్చారు.

నరేష్ వర్గం చేసే వ్యాఖ్యలను ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉండడంతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. నరేష్ ఎప్పుడూ 'మా'కు సహకరించలేదని స్పష్టం చేశారు. గతంలో 'మా'కు నిధులు కావాల్సి వస్తే చిరంజీవి గారితో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే రిహార్సల్స్ కు నరేష్ మొహం చాటేశాడని ఆరోపించారు శివాజీరాజా.

"అంతెందుకు, నా పుట్టినరోజు నాడే నన్ను చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ రోజున నన్ను కలిసేందుకు చాంబర్ వద్దకు రమ్మన్నాడు. నిజమే అని వెళితే ఎంతసేపటికీ రాలేదు. చూశావా.. శివాజీరాజాను ఎలా వెయిట్ చేయించానో అని వేరేవాళ్లతో అన్నాడట. ఇప్పుడు జీవిత లాంటి వాళ్లు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివాజీరాజా.  అయినా ఇష్టం లేకుండానే ఈసారి పోటీ చేస్తున్నానని, ఇతర సభ్యులు బలవంతం చేయడంతో తప్పడంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News